మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాశలు చేస్తున్నాయి. హెచ్1బీ వీసా స్పాన్సర్‌షిప్‌లను భారీగా తగ్గిస్తున్నాయి. విదేశీ గ్రాడ్యూయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు హెచ్1బీ వీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ వీసాలు ఉంటే ఆరేండ్ల పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పని చేసే వీలుంటుంది. అయితే, 2023తో పోల్చితే 2024లో హెచ్1బీ వీసా స్పాన్సర్‌షిప్‌లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. ఎక్కువ హెచ్1బీ వీసాలు స్పాన్సర్‌షిప్ చేసే మొదటి 15 కంపెనీల్లో దాదాపుగా అన్ని కంపెనీలూ 2024లో స్పాన్సర్‌షిప్‌లను తగ్గించాయని యూనైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) డాటా ద్వారా వెల్లడైంది.