
బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ఆదిత్య 369 (1991) చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో నాటి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. పాటలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి. శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తాను హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ ఈ సినిమా సీక్వెల్ ప్రకటన చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది. ఆదిత్య 999 మాక్స్ పేరుతో తెరకెక్క నున్న ఈ సినిమాలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బాలకృష్ణ నిమగ్నమై ఉన్నారని, ఆయనే దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ప్రసారం కాబోవు అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఆదిత్య 369 అవతార్‌లో కనిపించనున్నారు. ఈ షోలో ఆయన సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తారని చెబుతున్నారు.
