కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పదవీ గండం తప్పేలా లేదు. గత వారం తన మిత్రపక్ష పార్టీల నుంచి తిరస్కరణతో పాటు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామాతో చిక్కుల్లో పడ్డ ట్రుడో ఇప్పుడు సొంత పార్టీ ఎంపీల నుంచి కూడా నిరసన గళాన్ని ఎదుర్కొంటున్నారు. దేశంలోని అతి ముఖ్యమైన ఒంటరియో ప్రావిన్స్‌కు చెందిన 51 మంది ఎంపీలు వర్చువల్‌గా సమావేశమై ట్రూడోను పదవి నుంచి సాగనంపాలని నిర్ణయించారు.
ఈ ప్రావిన్స్‌లో పార్టీకి 75 మంది ఎంపీలు ఉండగా, క్రమంగా ప్రధానికి మద్దతు తగ్గుతూ వస్తున్నది. వారం రోజుల క్రితమే లిబరల్ పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ట్రూడో దిగిపోవాలంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత కెనడాను ఉద్దేశించి చేసిన బెదిరింపులపై ప్రధాని ట్రూడో స్పందించకపోవడా న్ని నిరసిస్తూ ఉప ప్రధాని క్రిస్టియా ఇప్పటికే రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లిబరల్ నేతల్లో కలవరం కలిగించింది.