వెన్నెలకిశోర్ టైటిల్‌రోల్ పోషించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. అనన్య నాగళ్ల, సియా గౌతమ్ కీలక పాత్రధా రులు. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకులు కె.ఎస్.రవీంద్ర(బాబీ), కల్యాణ్ కృష్ణ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని దర్శకుడు రైటర్ మోహన్ అన్నారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నానని, ఈ సినిమా చూసి నచ్చలేదని అంటే తన నెంబర్‌కు సంప్రదించవచ్చని, సినిమా విజయంపై అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామని వంశీ నందిపాటి తెలిపారు.
కథ మీద నమ్మకంతో ఉన్నామని, సినిమాలోని అన్ని అంశాలు కొత్తగా అనిపిస్తాయని, తప్పకుండా హిట్ కొడతామని నిర్మాత తెలిపారు. తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రమిదని కథానాయిక అనన్య నాగళ్ల తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది.