అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకున్న అధికారాలతో వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిన విషయం తెలిసిందే.
అయితే, బైడెన్ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. తాను బాధ్యతలు చేపట్టాక అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంపై న్యాయ శాఖను ఆదేశిస్తానని తెలిపారు. దేశంలో మళ్లీ శాంతి భద్రతలను పునరుద్ధరిస్తానని వెల్లడించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రేపిస్టులు, హంతకులకు మరణ శిక్ష అమలు చేస్తానని స్పష్టం చేశారు.