మానవుడి భవిష్యత్తు యుద్ధంలో లేదని, బుద్ధుడిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు అవకాశం ఉన్నా బౌద్ధం స్వీకరించారని గుర్తు చేశారు. ఒడిశా లోని భువనేశ్వర్లో జరుగుతున్న 18 వ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో రష్యా, ఇజ్రాయెల్ పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలో అడుగడుగునా వారసత్వం కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వ్యాపారులు సుమత్రా, బాలి, జావా వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసేవారని గుర్తు చేశారు. భారత్ ప్రజాస్వామ్యా నికి కేవలం తల్లి లాంటిది మాత్రమే కాదు, అది మన జీవితాల్లో భాగం. విదేశాల్లో జీవించేవారు భారత్కు రాయబారులు గా నేను చూస్తాను అని పేర్కొన్నారు.
భారత్ నుంచి యువత పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్లేలా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జీ20 సందర్భంగా దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేశాం. మన వారసత్వ, విభిన్న సంస్కృతులను ప్రపంచం గమనిస్తోంది. భారత్ స్వాతంత్య్రం సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు కూడా తోడ్పడ్డారు. ప్రవాస భారతీయులు వచ్చే ఏడాది ఈ ఉత్సవానికి వచ్చే సమయంలో కనీసం ఐదుగురు విదేశీ మిత్రులను తమతోపాటు తీసుకురండి. భారత్ కేవలం యువ దేశమే కాదు, నిపుణులైన యువకుల దేశం. భారత్కు విశ్వబంధుగా గుర్తింపు ఉంది. దానిని మరింత బలోపేతం చేయాలి అని ప్రధాని మోదీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు.