ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన యూఎస్ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందే ట్రంప్ వ్యవహారశైలి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా పొరుగు దేశాలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కెనడా, గ్రీన్‌లాండ్, పనామా కెనాల్ తమకేనంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి.
ఇక అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో ను గల్ఫ్ ఆఫ్ అమెరికా గా మారుస్తానంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ తాజాగా స్పందించారు. తామెందుకు అమెరికాను మెక్సికన్ అమెరికా అని పిలవకూడదంటూ ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. విలేకరు సమావేశంలో షేన్‌బామ్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలో ఉత్తర అమెరికాను మెక్సికన్ అమెరికా అని పిలిచేవారని గుర్తుచేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మనమెందుకు యూఎస్‌ను మెక్సికన్ అమెరికా అని పిలవకూడదు? అని ప్రశ్నించారు. ఇది వినడానికి బాగుంది కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.