అమెరికా ఒక వలసదారుల దేశమని, ఇక్కడ చట్టబద్ధమైన వలసలకు విస్తృత మద్దతు ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశీయ విధానాల సలహాదారు, భారత సంతతి అమెరికన్ నీరా టాండన్ పేర్కొన్నారు. భారతీయులు ఎక్కువగా పొందే హెచ్1బీ వీసాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఒక వలసవాద దేశం. ఇక్కడ చట్టబద్ధమైన వలసలకు విస్తృత మద్దతు ఉందనే విషయాన్ని వలస విధానంపై జరుగుతున్న చర్చలో విస్మరిస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు. భారతీయ అమెరికన్లపై ప్రదర్శిస్తున్న ద్వేషంపై నేను స్పందించినప్పుడు నాపైనా ద్వేషపూరిత ట్వీట్లు చేశారు. నేను భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని మాట్లాడుతున్నారు. భారతీయ అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని కొందరు మాటల దాడి చేస్తుంటే ట్రంప్ మౌనం పాటించడం సరికాదు. భారత అమెరికన్లు, ప్రత్యేకించి రిపబ్లికన్ పార్టీలో ఉన్నవారు ఈ ద్వేషానికి వ్యతిరేకంగా గళమెత్తాలి అని ఆమె అన్నారు.