ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నుండి వైదొలగాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయెసెస్ ప్రపంచ నేతలను కోరారు. ప్రపంచ దేశాల దౌత్యవేత్తలతో జరిపిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యుహెచ్‌ఓకు అతిపెద్ద మొత్తంలో నిధులు అందించే అమెరికా బయటకు వెళ్ళిపోవడం వల్ల తలెత్తే పరిస్థితులను ఎలా సద్దుబాటు చేస్తారో వివరించాలంటూ పలు దేశాలు గత వారం నాటి కీలక బడ్జెట్ సమావేశంలో డబ్ల్యుహెచ్‌ఓను కోరాయి. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా వుంది. సాధ్యమైనంత త్వరలో మనం ఆ పరిస్థితులను నివారించాలని జర్మనీ దౌత్యవేత్త బిజోర్న్ కమెల్ హెచ్చరించారు.2024-25 సంవత్సరానికి డబ్ల్యుహెచ్‌ఓకు అమెరికానే అతిపెద్ద విరాళాలు అందించే దేశంగా వుంది. 690కోట్ల డాలర్ల డబ్ల్యుహెచ్‌ఓ బడ్జెట్‌లో 98.8 బిలియన్లు అంటే దాదాపు 14శాతం అమెరికానే అందిస్తోంది. తాజాగా అమెరికా నిర్ణయం వల్ల డబ్ల్యుహెచ్‌ఓ ఆరోగ్య అత్యవసర కార్యక్రమాలు ప్రమాదంలో పడనున్నాయి.
ఆనాటి బడ్జెట్ సమావేశంలో డబ్ల్యుహెచ్‌ఓ ఆరోగ్య అత్యవసర కార్యక్రమాలను పరిశీలించినట్లైతే అమెరికా నగదుపైనే భారీగా ఆధారపడినట్లు తెలుస్తోంది. డబ్ల్యుహెచ్‌ఓ యూరప్ కార్యాలయంలోని కార్యకలాపాల్లో 80శాతానికి పైగా కార్యకలాపాలు అమెరికా విరాళాలపైనే ఆధారపడ్డాయి. దాదాపు 40శాతం అత్యవసర కార్యకలాపాలకు అమెరికా నిధులే అందుతాయి. తాజా చర్యల వల్ల మధ్య ప్రాచ్యం, ఉక్రెయిన్, సూడాన్‌ల్లో అత్యవసర ప్రతిస్పందనా చర్యలు ప్రమాదంలో పడతాయని ఆ బడ్జెట్ డాక్యుమెంట్ హెచ్చరించింది. యూరప్‌లో డబ్ల్యుహెచ్‌ఓ చేపట్టే క్షయవ్యాధి నివారణా కార్యకలాపాల్లో 95శాతం అమెరికా నిధులతోనే జరుగుతాయి.