అక్రమ వలసదారుల ఏరివేతలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని చర్యలు దిగుతున్నారు. భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే, వందలాది మంది భారత వలసదారుల్ని రెండో బ్యాచ్ కింద స్వదేశానికి పంపడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. 180 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను పంపబోతుంది. వీరు శనివారం అమృత్సర్కు చేరుకోనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారికమైన ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. వీళ్లంతా డంకీ రూట్, ఇతర మార్గాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులుగా ఆ దేశం పేర్కొంటున్నది. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, అమెరికాకు చేరుకున్న భారతీయుల్లో ఆందోళన నెలకొన్నది.
