బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతకొంతకాలంగా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. కూటమి దేశాల పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికన్ డాలర్ స్థానంలో వేరే కరెన్సీ తెచ్చేందుకు ప్రయత్నిస్తే 150 శాతం సుంకాన్ని విధిస్తామని పలుసార్లు తీవ్రంగా హెచ్చరించారు. తాజాగా బ్రిక్స్ దేశాలపై మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు. సుంకాలు విధిస్తామనగానే బ్రిక్స్ చెల్లాచెదురైపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్రిక్స్ దేశాలు డాలర్ ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నా యి. అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని సృష్టించాలనుకున్నాయి. డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొస్తే బ్రిక్స్ పై 150 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పగానే అందులోని దేశాలు పరస్పరం దూరం జరిగాయి. తర్వాత ఆ కూటమి మాటే వినిపించడం లేదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
