సింగపూర్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జూన్ 28న నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, వెంటకగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాధవనాయుడు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్టి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ భాటలోనే చంద్రబాబు, లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళుతున్నార న్నారు. మాధవనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీరంగంలో ఆయన సాధించిన విజయాలను వివరించారు. ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రావడానికి చంద్రబాబు ముందుచూపు కారణమన్నారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
















