
అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించేవారి వీసా రద్దు కావడంతోపాటు బహిష్కరణ తప్పదని భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరించింది. వీసా జారీ చేసినంత మాత్రాన స్క్రీనింగ్ ఆగదని, వీసా హోల్డర్లు యూఎస్ చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలు పాటిస్తున్నారో, లేదో నిర్ధారించుకోవడానికి నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉంటామని పేర్కొంది. నిబంధనలకు కట్టుబడని వారి వీసా రద్దు కావడంతోపాటు బహిష్కరణను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విద్యార్థులు, ఎక్స్‌చేంజ్ సందర్శకులకు జారీచేసే ఎఫ్, ఎం, జే క్యాటగిరీ వీసాల కోసం తమ సోషల్ మీడియా ఖాతాలను బహిరంగ పరచాలని అమెరికా ఇటీవలే కోరింది. అంతలోనే ఇప్పుడు ఈ హెచ్చరిక జారీచేయడం గమనార్హం.
















