Namaste NRI

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత .. ప్రముఖు సంతాపం

 ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కోట తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోట శ్రీనివాసరావు 1942 జులై 10వ తేదీన కంకిపాడులో జన్మించారు. కోట తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్. కోట కూడా మొదట్లో డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే, యాక్టింగ్ మీద ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పని చేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరగా సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు.

2003లో వచ్చిన సామి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన కాత్తాడి ఆయన చివరి తమిళ సినిమా. 1987లో విడుదలైన ప్రతిఘాత్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2016లో విడుదలైన భాగీ ఆయన చివరి హిందీ సినిమా. కన్నడలో 1997లో వచ్చిన లేడీ కమిషనర్ తో ఎంట్రీ ఇచ్చారు. 2023 విడుదలైన కబ్జా ఆయన చివరి కన్నడ సినిమా. కేవలం నటుడిగానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు.

40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సినిమాల్లోనే కాదు,  రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఉత్తమ విలన్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ హాస్య నటుడు ఇలా మొత్తంగా 9 సార్లు ఆయ‌న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌రాష్ట్రంలో ప్ర‌భుత్వం త‌రుపున నంది పుర‌స్కారాలు అందుకున్నారు. అంతేగాక ఆయ‌న సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కు గాను 2015లో భార‌త ప్ర‌భుత్వం నుంచి నాల్గవ అత్యున్నత పౌర పుర‌స్కారం ప‌ద్మ‌శ్రీ సైతం అందుకున్నారు.పలువురు సినీ ప్రముఖు సంతాపం ప్రకటించారు.  

ప్రముఖుల సంతాపం ..

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో యావత్ ప్రేక్షక లోకాన్ని అలరించి, వారి  అభిమానాన్ని దక్కించుకున్న  ఆయన మరణించడం  బాధాకరం అన్నారు. 

కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన విలక్షణ టనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోట శ్రీనివాసరావు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా బ్రహ్మానందం అన్నారు . నటన ఉన్నంత కాలం ఆయన ఉంటారు. కోట శ్రీనివాసరావు నటరాజపుత్రులు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. దాదాపు 4 దశాబ్దాల పాటు మేము కలిసి పనిచేశాం అన్నారు .

కోట శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని అన్నారు. వారి మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు మృతిప‌ట్ల అగ్ర క‌థానాయ‌కుడు చిరంజీవి సంతాపం వ్య‌క్తం చేశారు. లెజెండరీ నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన, నేను ఒకేసారి సినీ కెరీర్‌ను ప్రారంభించాం. ఆ తర్వాత వందలాది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రనీ తన విలక్షణమైన, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Social Share Spread Message

Latest News