అమెరికా జాతీయులైన చిన్నారిని దత్తత తీసుకునే ప్రాథమిక హక్కు భారతీయులకు లేదని బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సంరక్షణ, భద్రత అంశాలు లేదా చట్టపరమైన వివాదం లేని సమయంలో బంధువులైనా సరే దత్తతకు అవకాశం లేదని తెలిపింది. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, భద్రత) చట్టం, దత్తత నిబంధనల ప్రకారం ప్రస్తుత కేసులోని చిన్నారి వీటి పరిధిలోకి రాదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ రేవతి మొహితే దేరే, జస్టిస్ నీలా గోఖలేతో కూడిని ద్విసభ్య ధర్మానసం తీర్పును ఇచ్చింది. జన్మతా అమెరికా పౌరుడైన తమ బంధువుల చిన్నారిని దత్తత తీసుకునేందుకు అనుమతించాలంటూ భారతీయ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

విదేశీ పౌరసత్వం కలిగిన చిన్నారిని బంధువులైనా సరే దత్తత తీసుకోవడానికి జువెనైల్ జస్టిస్ చట్టంలో లేదా దత్తత విధానంలో ఎలాంటి నిబంధన లేదు. ఆ చిన్నారికి సంరక్షణ అవసరమని భావించినప్పుడు తప్పితే దత్తతకు అవకాశం ఉండదు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే దత్తతకు అనుమతి ఇచ్చేందుకు తన అసాధారణ అధికార పరిధిని వాడేందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది. అమెరికన్ జాతీయులైన చిన్నారిని దత్తత తీసుకోవడానికి పిటిషనర్లకు ప్రాథమిక హక్కు లేదని తేల్చి చెప్పింది.
















