Namaste NRI

సినిమా తీయాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి: పవన్‌ కల్యాణ్‌

పవన్‌కల్యాణ్‌ హీరోగా రూపొందిన చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్‌) దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం సమర్పణలో ఏ.దయాకరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. హరిహర వీరమల్లు బాగా రావడానికి ఏ.ఎం.రత్నం పడ్డ తపన సామాన్యమైనది కాదు. ఈ సినిమాకోసం ఆయన నలిగిపోతుంటే బాధేసింది. నిర్మాతలు కనుమరుగవుతున్న నేటి తరుణంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడ్డ నిర్మాతకూ, అన్నం పెట్టిన సినిమాకూ అండగా నిలవాలని నా షెడ్యూల్స్‌ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. చిన్నపాటి సౌకర్యం కోసం ఓ యుద్ధమే చేయాల్సి ఉంటుంది అని అజ్ఞాతవాసి సినిమా కోసం త్రివిక్రమ్‌ ఓ డైలాగ్‌ రాశారు. అలాంటిది ఒక సినిమా చేసేందుకు ఆర్ధికంగా, సృజనాత్మకంగా ఎన్ని యుద్ధాలు చేయాలి? ఈ సినిమా ఆ యుద్ధాలన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి చేరింది అని అన్నారు.

 హరిహర వీరమల్లు సినిమా మొదలైన నాటినుంచి చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నది. రెండు కరోనా పరిస్థితుల్ని దాటుకొని, క్రియేటివ్‌ ఇబ్బందుల్ని అధిగమించి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇచ్చినమాటకు కట్టుబడి నా బెస్ట్‌ ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించా. కృష్ణాతీరం కొల్లూరులో దొరికిన కోహినూర్‌ వజ్రం హైదరాబాద్‌ సుల్తాన్‌ల వద్దకు ఎలా చేరింది? ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా జరిగింది? అనే అంశాలకు ఫిక్షన్‌ను జోడించి రాసుకున్న కథ ఇది.

ఈ కథకు పునాది వేసింది దర్శకుడు క్రిష్‌. అద్భుతమైన కథతో నాదగ్గరకు వచ్చారాయన. కొన్ని తప్పని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి దూరమయ్యారు. అయితే బాధ్యతలు తీసుకున్న జ్యోతికృష్ణ కథలోని ఆత్మ దెబ్బ తినకుండా, ప్రతి విషయాన్నీ సునిశితంగా డిస్కస్‌ చేస్తూ జనరంజకంగా సినిమాని మలిచాడు. జ్యోతికృష్ణ రూపంలో తెలుగు పరిశ్రమకు ఒక మంచి దర్శకుడు దొరికాడని నమ్మకంగా చెబుతున్నా. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు ప్రాణవాయువు. రత్నంగారు, డీవోపీ మనోజ్‌ పరమహంస, జ్యోతికృష్ణ నిద్రలు మానుకొని మరీ ఈ సినిమాకోసం కష్టపడ్డారు అని తెలిపారు. మేకప్‌మ్యాన్‌ స్థాయి నుంచి, రచయితగా, నిర్మాతగా ఎదిగిన మంచి మనిషి ఏ.ఎం.రత్నం అని, అందుకే ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌(ఏపీఎఫ్‌డీసీ) పదవికి ఆయన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రతిపాదించానని, అలాంటి వ్యక్తి ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అయితే సినీ పరిశ్రమ బాగుంటుందనే ఈ ప్రతిపాదన చేశానని  తెలిపారు.

Social Share Spread Message

Latest News