మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల కోత 2025లో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులపై వేటుపడింది. ఈనెల ప్రారంభంలో సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉద్యోగులకు భావోద్వేగంతో ఓ లేఖ రాశారు. కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు గందరగోళానికి గురిచేస్తూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

తనను అమితంగా బాధిస్తున్న విషయాలను మాట్లాడదలచుకున్నానని, అదే సమయంలో ఇటీవలి ఉద్యోగాల తొలగింపుపై మీలో చాలామంది ఏం ఆలోచిస్తున్నారో కూడా తనకు తెలుసునని ఆయన తెలిపారు. దిగ్గజ కంపెనీలు సైతం దీని బారిన పడుతూ ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు విడతల్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులను తొలగించామని, ఇది తనను ఎంతగానో కలచివేసిందని ఆయన తెలిపారు.
















