Namaste NRI

యూఎస్ వీసా విధానంలో కీలక మార్పు…ఇకపై రెన్యూవల్ కోసం

అమెరికా వీసా ఇంటర్వ్యూ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. వీసా ఇంటర్వ్యూ వైవర్ విధానం సెప్టెంబర్ 2 నుంచి రద్దు కానుంది. ఫలితంగా అన్ని వర్గాల వారు ఇకపై వీసా రెన్యూవల్ కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో కొన్ని వర్గాలకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది. ఇది తొలగించడంతో ఇకపై వర్క్ వీసా, స్టూడెంట్ వీసా ఉన్న వారు, వారి కుటుంబసభ్యులు ఇక్కట్ల పాలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

పర్యటన, బిజినెస్ కేటగిరీలు మినహా అన్ని వర్గాల వారు వీసా రెన్యూవల్ కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి వస్తుందంటూ అమెరికా విదేశాంగ శాఖ జులై 25నే ప్రకటించింది. 14 ఏళ్ల లోపు చిన్నారులు, 79 ఏళ్లకు పైబడిన వృద్ధులకు గతంలో ఇచ్చిన మినహాయింపును కూడా ఉపసంహరించుకుంది. మొదట్లో వీసా వైవర్ ఉన్న వారు కేవలం నెల రోజుల్లోనే డాక్యుమెంట్స్‌ సమర్పించేందుకు అపాయింట్‌మెంట్ లభించేది. కానీ తాజా నిబంధనలతో ఇకపై వర్క్ వీసాలు ఉన్న వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వీసా కన్సల్టెంట్‌లు చెబుతున్నారు.

ఇక పాత విధానంలో ఇప్పటికే సెప్టెంబర్ 2 తరువాత అపాయింట్‌మెంట్ తీసుకున్న వారి విషయంలో కూడా అస్పష్టత నెలకొంది. హెచ్-1బీ వీసాదారుల కుటుంబసభ్యుల్లో అనేక మందికి వీసా వైవర్ విధానంలో సెప్టెంబర్ 2 తరువాతి తేదీల్లో అపాయింట్‌మెంట్స్ లభించాయి. ఈ విధానం రద్దు కానున్న నేపథ్యంలో వారు మళ్లీ అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకోవాలా వద్దా అనే విషయంలో అస్పష్టత నెలకొంది.

Social Share Spread Message

Latest News