భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ సర్కార్ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముందస్తు బెదిరింపులు మొదలయ్యాయి. అమెరికాలో పండించిన మక్క పంటను భారత్ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తే అమెరికన్ మార్కెట్‌కు భారత్ దూరం కావలసి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ హెచ్చరించారు. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తన ఆంక్షలను సడలించుకునే ప్రయత్నం చేస్తుండగా లుత్నిక్ మాత్రం భారత్ తన సుంకాలను తగ్గించుకోకపోతే కష్టకాలం ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించడం గమనార్హం. లుత్నిక్ మాట్లాడుతూ భారత్-అమెరికా సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాకు విక్రయించి భారత్ సొమ్ము చేసుకుంటోంది. మా మార్కెట్‌లోకి వచ్చి ప్రయోజనం పొందాలని మేము ఆహ్వానిస్తుంటే భారత్ మాత్రం మమ్మల్ని తన మార్కెట్‌లోకి మేము రాకుండా అడ్డుకుంటోంది అని ఆయన ఆరోపించారు.

తమకు 140 కోట్ల జనాభా ఉందని భారత్ గొప్పలు చెప్పుకుంటుందని, 140 కోట్ల మంది కలసి ఒక బుషెల్ మక్కలు (అంటే 25.4 కిలోలతో సమానం) కూడా కొనలేరా అని ఆయన ప్రశ్నించారు. వాళ్లు(భారత్) మాత్రం తమకు అన్నీ అమ్ముతారని, తమ దగ్గర నుంచి మాత్రం మక్కజొన్న కూడా కొనరని, అన్ని వస్తువులపై సుంకాలు మాత్రం విధిస్తారని, ఇది తమకు బాధ కలిగించదా అని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు.















