భారత్ పై ట్రంప్ విధించిన టారిఫ్‌లు రష్యాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటె పేర్కొన్న విషయం తెలిసిందే. ట్రంప్ విధించిన టారిఫ్‌లతో ఇబ్బంది పడుతున్న న్యూఢిల్లీ, రష్యా అధినేతతో ప్రధాని మోదీ మాట్లాడినట్లు తెలిపారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహంపై మోదీ ఆరా తీసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై భారత్ తాజాగా స్పందించింది. నాటో చీఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

ప్రధాని మోదీ, పుతిన్ మధ్య అలాంటి చర్చలు ఏమీ జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించి నాటో చీఫ్ మార్క్ రుటె చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. ఆయన చెప్పినట్టుగా మోదీ-పుతిన్ మధ్య అలాంటి చర్చలు ఏవీ జరగలేదు. ఆయన చేసిన ప్రకటన తప్పు. పూర్తిగా నిరాధారమైనవి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
















