
బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ అఖండ కి మించిన అంచనాలు అఖండ 2 పై ఉన్నాయి. అఖండలో బాలకృష్ణ పాత్రని అఖండగా పరిచయం చేశారు. ఇందులో డైరెక్టర్ బోయపాటి బాలయ్య విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢకొీనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్‌లో ఆది పినిశెట్టి కూడా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ చాలా కొత్త గెటప్ ఇచ్చారు. అతని దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అఖండ పాత్రలో ఉంటుంది. అలాంటి రెండు శక్తులు మధ్య యాక్షన్‌ని చాలా కొత్తగా కంపోజ్ చేశాం. ఇందులో మూడు వేరియేషన్స్ ఉన్న ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. మొత్తం మూడు క్యారెక్టరైజేషన్స్ కూడా మాకు కొత్తగా చేసే అవకాశం ఇచ్చాయి. అఖండ కి మించిన స్పాన్, కాన్వాస్ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రేక్షకులు, అభిమానులు 100% అంచనాలు పెట్టుకుంటే వెయ్యిశాతం ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది.
















