వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డు సిబ్బందిపై ఓ అఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో అమెరికా వ్యవస్థ సంపూర్ణంగా కోలుకునేందుకు వీలుగా థర్డ్ వరల్డ్ దేశాలు (పేద దేశాలు) అన్నిటి నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఈ చర్య ప్రపంచ దేశాలపైన ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు ఉపాధి, విద్య కోసం, తమ దేశాలలో ఎదురవుతున్న వేధింపులను తప్పించుకునేందుకు అమెరికాకు వలసపోతున్న కోట్లాది మంది విదేశీయులపై తీవ్ర ప్రభావం చూపనున్నది.

సాంకేతికంగా అమెరికా పురోభివృద్ధి చెందినప్పటికీ దాని వలస విధానం ఆ ప్రయోజనాలను, అనేక మంది జీవన పరిస్థితులను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు మూడవ ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో చట్టవ్యతిరేకంగా దేశంలోకి జరిగిన కోట్లాది మంది ప్రవేశాలను రద్దు చేస్తానని ఆయన తెలిపారు. అమెరికా అభివృద్ధికి పనికిరాని, తమ దేశాన్ని ప్రేమించడం చేతకాని ఎవరినైనా దేశం నుంచి పంపించివేస్తామని ఆయన హెచ్చరించారు.
















