తెలంగాణ సీఎం కేసీఆర్ చేసే తాటాకు చప్పుళ్లకు కేంద్రం కానీ, బీజేపీగానీ భయపడే పరిస్థితి లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఢల్లీిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లు ఖర్చుచేసినా ఓట్లు, రాకపోవడం, కొడుకు ముఖ్యమంత్రి కాలేడన్న ఆవేదన, ఆక్రోశంతో కేసీఆర్ తమపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బాధను అర్థం చేసుకుని సానుభూతితో ఉండాలని కోరుతున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్‌పై పెంచిన సెస్‌తో కరోనా సంక్షోభ సమయంలో దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఏడాదిన్నర పాటు ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్సిన్ వైద్య పరికరాలు, వైద్య ఖర్చుల కోసం వినియోగించినట్లు తెలిపారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘోర ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ కేంద్రం, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఢల్లీిలో ధర్నా చేస్తే భయపడే ప్రభుత్వం మాది కాదు అని మండిపడ్డారు. కరోనా మరణాల విషయంలో కేసీఆర్ ఎలాంటి తప్పుడు లెక్కలు చూపించారో అందరికి తెలుసని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముడి బియ్యాన్ని దశల వారీగా కేంద్రం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.














