Skip to main content

Namaste NRI

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగదు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. “ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ పేదవాడికి అన్యాయం జరగదు. ఎవరి ఆస్తులను గుంజుకోవడం లేదు. మన అందరి భవిష్యత్తు కోసం చేపట్టిన ప్రాజెక్టు. హైదరాబాద్‌ను గొప్ప అభివృద్ది చెందిన నగరంగా నిలబెట్టాలన్న ఆశయం. అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వండి”. అని ముఖ్యమంత్రి కోరారు.

మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన MusiInvites సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మూసీ చారిత్రక పరిణామాలు, ప్రాజెక్టు లక్ష్యాలు, దాని ఆవశ్యకతను వివరిస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, నిపుణులు, నిష్ణాతులు, పౌరులు తమ సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ సదస్సుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మూసీ ప్రతిపాదిత ప్రాజెక్టు వెంట మొత్తంగా 10 వేల పేద కుటుంబాలున్నాయి. ఇప్పటికే డేటా సేకరించాం. వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశాం అన్నారు. అయితే, దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఉపాధి కోల్పోతామని అంటున్నారు. అందుకని సమీప ప్రాంతాల్లోనే ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికీ నష్టం చేయం. వారితో నాకు శత్రుత్వం ఏముంటుంది. పేదల్లో దుఃఖాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నా ఆలోచనలన్నీ పేదల వెంటే ఉన్నాయి.ఏ పేదవాడికి అన్యాయం చేయం. ఏ పేదవాడిని నిరాశ్రయులుగా చేయబోం అన్నారు.
1908లో మూసీకి ఉప్పెన వచ్చి వేలాది మంది మరణించిన సందర్భంలో ఆనాటి నిజాం వరద నివారణ, జంట నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి వందేళ్ల కిందట ఒక గొప్ప విజన్‌తో ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్‌లను నిర్మించిన చరిత్రను విస్మరించరాదు.

ఎంతో దూరదృష్టితో వందేళ్ల కిందట గొప్ప గొప్ప ప్రాజెక్టులు, వారసత్వ సంపదను సృష్టించి మేటి నగరంగా అందించారు. అలాంటి నగరాన్ని ఇలాగే వదిలేద్దామా. ప్రపంచంలో వస్తున్న మార్పులు, పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు వెళదామా. మన రాజకీయ అవకాశాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా.

ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు భావి తరాలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దా. గాంధీ విగ్రహం కోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాదాపు 75 కోట్లకు మించి ఖర్చు చేయడం లేదు. మొత్తం ప్రాజెక్టు 6500 నుంచి 7 వేల కోట్లకు మించి లేదు.

ఇది కోట్లాది మంది నగర ప్రజల భవిష్యత్తు. దీన్ని కాపాడుకుందామా. కాలానికి వదిలేద్దామా. ఏం కావాలో సలహాలు ఇవ్వండి. వెబ్‌సైట్‌లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మంచిని తప్పకుండా స్వీకరిస్తాం. కుట్ర సిద్దాంతానికి ముగింపు పలకండి. నేను మీలో ఒకడిని. అందరం కలిసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్దాం. ప్రపంచంతో పోటీపడే విధంగా హైదరాబాద్ ను ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకుందాం…” అని ముఖ్యమంత్రి భావోద్వేగంతో చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events