హనుమాన్, మిరాయ్ వంటి రెండు బ్లాక్బస్టర్లను అందించిన హీరో తేజ సజ్జ మరోసారి జాంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆ సినిమానే జాంబీరెడ్డి 2 నెక్ట్స్ లెవెల్. తేజా సజ్జా పుట్టినరోజు సందర్భంగా జాంబీరెడ్డి ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జాంబీరెడ్డితో జాంబీ ప్రపంచాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మింస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల కానున్నది.

ఈ సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఫ్లైఓవర్ పైనుంచి ఓ జాంబీ ట్రక్కుపై పడటం జాంబీస్ ఆర్ బ్యాక్ అనే క్యాప్షన్‌తో గ్లింప్స్ మొదలైంది. గ్లింప్స్ ఆద్యంతం జాబీలతో పోరాడుతూ తేజా సజ్జా కనిపించారు. ఈ సారి కథ, యాక్షన్, స్కేల్ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్టు గ్లింప్స్ చెబుతున్నది. కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో షానాయ కపూర్ కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: గౌర హరి.















