ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని అమెరికాలోని ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆహ్వానించారు.న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక టెక్నాలజీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయనున్న క్వాంటం వ్యాలీ రాష్ట్ర టెక్నాలజీ ప్రస్థానంలో కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్, పరిశోధన, ఆవిష్కరణల వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ఇది వేదికగా మారనుందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, వేగవంతమైన అనుమతులు, పరిశ్రమలకు అవసరమైన ప్రభుత్వ సహకారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మోహన కృష్ణ వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వేగంగా చేపడుతున్న అభివృద్ధి, టెక్నాలజీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యంపై అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలు ఆసక్తి వ్యక్తం చేశారన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, రాష్ట్రంలో టెక్నాలజీ రంగానికి కొత్త అవకాశాలను తీసుకొస్తున్నాయని పేర్కొంటూ, ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు.















