పవన్‌కల్యాణ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం పురుషః. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాత బత్తుల కోటేశ్వరరావు. వీరు వులవల దర్శకుడు. ఈ సందర్భంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు విలేకరులతో ముచ్చటించారు. హీరో అవ్వాలనే తన కలను కొడుకు ద్వారా నెరవేర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. గోకులంలో సీత సినిమా చూసి నేను పవన్‌కల్యాణ్ అభిమానిగా మారాను. కొడుకు పుడితే ఆయన పేరే పెట్టుకోవాలనుకున్నా. తమ్ముడు టైంలో మాకు అబ్బాయి పుట్టాడు. ఆయన పేరే పెట్టాను అన్నారు.

తమ అబ్బాయికి సిగ్గు, బిడియం చాలా ఎక్కువని, సినిమాల వల్ల కలుపుగోలుతనం పెరిగి కాన్ఫిడెంట్‌గా తయారవుతారనే ఉద్దేశ్యంతో వాడిని హీరో చేశానని చెప్పారు. పురుషః విభిన్నమైన కాన్సెప్ట్. ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ముఖ్యంగా ప్రేమకథలోని కొత్తదనం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, సప్తగిరి పండించే కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. మా అబ్బాయితో మూడు సినిమాలు చేస్తానని మాటిచ్చాను. సక్సెస్ అయితే ఓకే. లేకుంటే ఊరికి వెళ్లి వ్యవసాయం చేయాలని ముందుగానే చెప్పాను. ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ర్టాల్లో 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ వేసవిలో చక్కటి వినోదం కోసం ఈ సినిమా చూడాలని ప్రేక్షకుల్ని కోరుతున్నా అని బత్తుల కోటేశ్వరరావు అన్నారు.





























