రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. నేడు ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆర్‌సీ 17 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కథానాయికగా నటించేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. గతకొంతకాలంగా బాలీవుడ్ భామలు సారా అర్జున్, అనీత్ పడ్డా పేర్లు వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి కథానాయికగా ఖరారైందని తెలిసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నదీ భామ. తొలి చిత్రం విడుదల కాకముందే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో నిజానిజాలెంటో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.















