తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర నియమిస్తున్నట్టు న్యూజెర్సీ ప్రవాసుల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహారించాలని తాను కోరటంతో ఆనంద్ మహీంద్ర అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని సిఎం రేవంత్ తెలిపారు. తొలిసారి పబ్లిక్, -ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌ల్లో నైపుణ్యమిచ్చి, ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.
ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై చర్చలు జరిపారు. ఈనెల 01వ తేదీన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా బ్యాగరికంచె వద్ద సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు.