ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది. ఈ మేరకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా 91 దేశాల్లోని పలువురు యూజర్లకు థ్రెట్ నోటిఫికేషన్లను పంపించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసస్ లాంటి స్పైవేర్లను మెర్సినరీ స్పైవేర్లుగా పిలుస్తారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన వీటితో ప్రముఖులైన లక్షిత వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుంటారు. సైబర్ దాడు లకు గురికాకుండా యాపిల్ ఫోన్లకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. అయితే, యాపిల్ ఐడీ సాయంతో మెర్సినరీ స్పైవేర్లు ఐఫోన్లు, ఇతర యాపిల్ ఉత్పత్తులలోకి సులభంగా చొరబడగలవని నిపుణులు చెప్తున్నారు. ఇదే జరిగితే, ఆ ఉత్పత్తుల ద్వారా ఎవరేం చేస్తున్నారన్న ప్రతీ విషయం నేరగాళ్లకు చేరుతుంది.