Namaste NRI

తెలుగు భాషకు ముప్పు తప్పించండి… భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

భారత స్వాతంత్య్ర పోరాటంలో విభిన్న ప్రాంతాల్లో స్థానిక భాషలు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించాయని, ప్రస్తుతం తెలుగు భాషకు రానురాను ఆదరణ తగ్గిపోతోందని, ఇకనైనా తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరూ ముందుకురావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, నార్వేకు చెందిన వీధి అరుగు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలనో స్థిరపడినా మాతృభాష తెలుగును పరిక్షించుకునేందుకు పాటుపడుతున్న నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. తెలుగు భాషను ప్రోత్సహించడానికి వారు చేస్తున్న కృషి, చూపిస్తున్న ఉత్సాహం బహుశా తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపించదేమోనని ఎన్వీ రమణ అన్నారు. తాజా జనాభా లెక్కల ప్రకారం నేడు భారత  దేశంలో 8.10 కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడేవారున్నారని, సంఖ్యాపరంగా చూస్తే తెలుగు మాట్లాడెవారు దేశంలో 3వ స్థానంలో, ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నారని అంచనాలున్నాయని ఆయన తెలిపారు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరం నుంచి ఉనికిలో ఉన్న తెలుగు భాష ఒక ఉద్యమ రూపం దాల్చడానికి ఒకానొక కారణం మహాభారతాన్ని కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ తెనుగించడమే  అని వ్యాఖ్యానించారు.  భాషను ప్రగతిశీలంగా మలిచిన యుగపురుషుల్లో గిడుగు వేంకట రామూర్తి పంతులు అగ్రగణ్యులని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి త్రయం, సాహితీ సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారని అన్నారు. వాడుక భాషా ఉద్యమం అప్పుడప్పుడే ఒక రూపుదిద్దుకుంటున్న స్వాతంత్య్ర పోరాటానికి సైతం ఊపునిచ్చిందని గుర్తు చేశారు. ఒక మనిషితో అతడికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే అతడి తలకి మాత్రమే ఎక్కుతుంది. అతడి సొంత భాషలో మాట్లాడితే అతడి హృదయాన్ని స్పశిస్తుంది. అన్న నెల్సన్‌ మండేలా వ్యాఖ్యలను భారత ప్రధాన  న్యాయమూర్తి గుర్తు చేశారు.
  నందమూరి తారక రామారావు అగ్రశ్రేణి సినీనటుడుగా వెలుగొందడం వల్లనే ఆయన సులువుగా అధికారంలోకి రాగలిగారని అందులో సందేహం లేదని అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం కాస్త భిన్నంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ సినీ ప్రాభవం, స్ఫురద్రూపం, రాజకీయ అనుకూలతలు, చైతన్య రథపు వినూత్న ప్రయోగం ఇవన్నీ ఒకెత్తయితే, ఊరూరా తిరిగి, సరళ మైన సామాన్యుడి భాషలో, ఆనర్గళంగా ప్రసంగించి తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం. ఆయన విజయంఒలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. 1980వ దశకం ఆరంభం వరకు  తెలుగువారిని కూడా మద్రాసీలుగా జమ కట్టేవారని, తెలుగు ఆత్మ గౌరవానికి, భాషకు, సంస్కృతికి ఎన్టీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
ప్రస్తుతం తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి భాషాభిమానులందరూ ఉద్యమ స్థాయిలో పూనుకోవాలని పిలుపునిచ్చారు. డిగ్రీ వరకు తాను తెలుగు మాధ్యమంలోనే చదివానని, ఇంగ్లీషు అభ్యాసం 8వ తరగతిలో ఆరంభమైందని తెలిపారు. ఉద్యోగ ధర్మం కనుక ఆంగ్లంలో అభ్యాసం, వాడకం కొనసాగిస్తున్నానని, పల్లెటూళ్లో పుట్టి, ప్రభుత్వ  పాఠశాలలో మాతృభాషలో చదువుకుని తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. పాఠ్య పుస్తకాలు, విద్యాబోధన వ్యావహరికంలో సాగడం తనలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడిరదని అన్నారు. గ్రాంధికం కొనసాగి ఉంటే బహుశా తాను జీవితంలో ఎప్పడూ పొన్నవరం దాటి ఉండే వాడినో కాదేమో అన్నారు. జపాన్‌, చైనాలు పరాయిభాషల మోజులో పడలేదని, తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకున్నాయని రమణ అన్నారు. నిజానికి ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక శక్తి బయటి వారిని సైతం చైనీస్‌, జపనీస్‌ భాషలు నేర్చుకునేలా పురి కొల్పుతున్నాయని వ్యాఖ్యానించారు.
కార్యక్రమ నిర్వాహకులు పెట్లూరు విక్రమ్‌కు  జస్టిస్‌ రమణ అభినందనలు తెలిపారు. మండలి బుద్ద ప్రసాద్‌, గరికిపాటి నరసింహారావు, కొలకలూరి ఇనాక్‌, గిడుగు స్నేహలత, తరిగోపుల వెంకట్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events