అమెరికాలోనూ ప్రవాసీయులు బోనాల జాతరను నిర్వహించుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాట) ఆధ్వర్యంలో తెలంగాణాలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజించి బోనం సమర్పించే ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు ప్రవాసులు. హైదరాబాద్ లాల్ దర్వాజ లష్కర్ బోనాలను మరిపించే విధంగా, న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో సాయిదత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో బోనాలప్రదర్శన, పోతురాజుల నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు. అమెరికాలో తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు.ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు సంప్రదాయ వస్త్రధారణలో భారీ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దేవాలయ నిర్వాహకులు ,మాటా వారి సహకారంతో మహిళలు అందరూ అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించుకున్నారు . తెలంగాణ, అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు.
ఆషాడ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళీ బోనాలను డప్పు చప్పుళ్లతో , తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకల్ టాలెంటును ఎప్పుడూ ప్రోత్సహించే మాట టీం ఈ సారి కూడా పోతురాజుల విషయంలోనూ లోకల్గా ఉండే వేణు గిరి, అశోక్ చింతకుంటను పోతురాజు లాగా ఎంకరేజ్ చేసి అమెరికాలోను పోతురాజులు ఉన్నారు అనేలా చేశారు. ఈ సందర్భంగా మాట అధ్యక్షులు శ్రీనివాస గనగోని అందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో రెండొవసారి బోనాలు చేయడం, వందల సంఖ్యలో మహిళలు పాల్గొన డం, ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతృప్తిని కలిగించిందన్నారు. ఆ అమ్మవారి శక్తి తోడయి మాటా వైవిధ్యమయిన, అందరికి ఉపయోగకరమైన సేవ కార్యక్రమాలతో మరింత సేవ చేసే ఆవకాశం కలగాలని, ఆ శక్తి ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఈ వేడుకల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుద్దగి, సెక్రెటరీ ప్రవీణ్ గూడురు, ఎగ్జికూటివ్ కమిటీ సభ్యులు స్వాతి అట్లూరి, శ్రీధర్ గూడాల, బోర్డు అఫ్ డైరెక్టర్ కృష్ణ శ్రీ గంధం, మాటా కార్యవర్గం, కృష్ణ సిద్ధాడ,శిరీష గుండపునేని ఆధ్వర్యంలో, వెంకీ మస్తీ, కళ్యాణీ బెల్లంకొండ, పూర్ణ భేడిపూడి, మల్లిక్ రెడ్డి సహాకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్టాండింగ్ కమిటి మెంబెర్స్ మరియు రీజినల్ కో ఆర్డినేటర్స్ తో పాటు గిరిజ మదాసి అలంకరణ చేసేందుకు సహాయం చేశారు.
సాయిదత్త పీఠం నుంచి పూర్ణిమ,రంజిత ఈ సంబురాల్లో తమ వంతు పాత్ర పోషించారు. మాటా పిలుపు మేరకు అమెరికా వ్యాప్తంగా స్థిరపడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యంలో ఈ బోనాల జాతరలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. జాతరలో పాల్గొని వేడుకను విజయవంతం చేసిన తెలుగువారందరికీ మాటా నిర్వహాకులు ధన్యవాదాలు తెలిపారు.