
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ వీరోచిత గాథతో రూపొందించిన ఛావా చిత్రానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400కోట్లకుపైగా వసూళ్లతో దూసుకుపోతున్నది. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా మార్చి 7న విడుదలకానుంది. ఓ పోరాటయోధుడి కథ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా ఈ సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నామని, భారీ స్థాయిలో రిలీజ్ ఉంటుందని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ, అశుతోష్ రాణా తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మించారు.
