అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిసి)పై ఆంక్షలు విధించారు. ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డరుపై ట్రంప్ సంతకం చేశారు. ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధాజ్ఞలు అమలవుతాయి. ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింప చేయడంతోపాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించే అధికారం ఉంది. అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ లక్షంగా ఐసీసీ నిరాధార దర్యాప్తులు చేపడుతోందని, ట్రంప్ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారంట్ జారీ చేసి ఐసీసీ , తన అధికారాలను దుర్వినియోగం చేసిందని ట్రంప్ మండిపడ్డారు. అందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అఫ్గనిస్థాన్లో అమెరికా సర్వీస్ సభ్యులపై , గాజాలో ఇజ్రాయెల్ దళాలు చేసిన యుద్ధ నేరాలపై ఐసీసీ దర్యాప్తుల్ని ప్రస్తావించారు. మాపై , మా మిత్రదేశం ఇజ్రాయెల్పై ఐసీసీ చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ ఐసిసికి న్యాయపరిధిలో లేవని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ జరిగిన రెండు రోజుల వ్యవధి లోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానిపై గత ఏడాది అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)