అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. ఒహాయో లోని క్లీవ్‌ల్యాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు, సుంకాల విధింపు, అధ్యక్ష పదవిని స్వప్రయోజనాలకు వాడుకోవడం లాంటి అంశాలపై ఒబామా తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎవరూ కోరుకోని, ఎవరూ ఓటు వేయని అనవసరమైన యుద్ధానికి ట్రంప్ తెరలేపారని ఒబామా విమర్శించారు. తన హయాంలో కుదుర్చుకున్న అణు ఒప్పందం కారణంగా ఒక్క క్షిపణిని కూడా ప్రయోగించాల్సిన అవసరం లేకుండానే ఇరాన్‌ను అణ్వాయుధాల తయారీ నుంచి నిరోధించగలిగామని ఆయన గుర్తుచేశారు. అయితే గత ఏడు నెలలుగా సాగుతున్న ఘర్షణల వల్ల మిత్రదేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగాయని, ఈ దాడుల్లో అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా పలువురు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు పట్టుచిక్కడంవల్లే చమురు, డీజిల్ ధరలు పెరిగాయని ఒబామా మండిపడ్డారు. డొనాల్డ్ ట్రంప్‌కు సుంకాలంటే అమితమైన ఇష్టమని, అయితే వాటి భారం అంతిమంగా వినియోగదారులపైననే పడుతుందని హెచ్చరించినా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకట్ట వేయడానికి లభించిన ఆఖరి అవకాశమని ఒబామా పేర్కొన్నారు.















