భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. భారత్‌ను నరకకూపంగా అభివర్ణించారు. వలసదారులు అమెరికాకు విధేయులు కారని, అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం లభించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇక్కడ పుట్టిన పసికందు తక్షణమే పౌరసత్వం పొందుతుంది. ఆ తర్వాత వాళ్లు చైనా, భారత్ లేదా ఈ భూమ్మీద ఉన్న మరేదైనా నరకప్రాయమైన ప్రదేశం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకువస్తారు. ఇది చూడడానికి మీరు మరీ దూరం వెళ్లనవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు ఇంగ్లిష్ మాట్లాడటం లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న వలసదారుల్లో ఈ దేశం పట్ల ఏమాత్రం విధేయత లేదు. కాని ఒకప్పుడు ఇలా ఉండేది కాదు అని ట్రంప్ పేర్కొన్నారు.

ఐరిష్, ఇటాలియన్, పోలిష్, లిథువేనియన్, డొమేనియన్, రష్యన్ వంటి సమూహాలు అమెరికన్ సమాజంలో విజయవంతంగా కలిసిపోయాయని, అయితే సంప్రదాయ మెల్టింగ్ పాట్(వివిధ సంస్కృతుల సమ్మేళనం) ఆశించిన విధంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నేపథ్యంతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ఎవరైనా ఆటోమేటిక్‌గా పౌరులు అవుతారని భావన అయిన జన్మతః పౌరసత్వం అసమంజమైనదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ పౌర హక్కుల సంఘాన్నీ (ఏసీఎల్‌యూ) ఆయన వదిలిపెట్టలేదు.















