సోషల్‌మీడియాలో తన పారితోషికం గురించి వస్తున్న రూమర్స్‌పై కథానాయిక శ్రీనిధి శెట్టి స్పందించింది. ఒక్కో సినిమాకు తాను 8కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాననే ప్రచారం జరుగుతున్నదని, అందులో నిజంలేదని స్పష్టం చేసింది. నేను చేసిన సినిమాలే చాలా తక్కువ. అలాంటప్పుడు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరిస్తారు? ఎవరో కొందరు టైంపాస్ కోసం ఇలాంటి రూమర్స్‌ను వ్యాప్తి చేస్తుంటారు. వాటిని అస్సలు పట్టించుకోవద్దు అని శ్రీనిధిశెట్టి వివరణ ఇచ్చింది.

ఒకవేళ డబ్బు తనకు ప్రధానమైతే ఇప్పటికే ఓ ముప్పై చిత్రాల్ని అంగీకరించేదాన్నని, కెరీర్ ఆరంభం నుంచి మంచి కథలకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాల్ని ఎంపిక చేసుంటున్నానని ఈ భామ తెలిపింది. కేజీఎఫ్ ఫ్రాంఛైజీ చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత తెలుగులో హిట్-3, తెలుసు కదా వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ కన్నడ సొగసరి వెంకటేష్‌తో కలిసి ఆదర్శ కుటుంబం చిత్రంలో నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.















