థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. తెలంగాణ అంతటా మరోసారి ‘ఫీవర్ సర్వే’ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి ఫీవర్ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో తెలంగాణ అంతటా ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. థర్డ్‌వేవ్ వచ్చే సూచనలున్నాయన్న నేపథ్యంలో మరోసారి ఫీవర్ సర్వే నిర్వహించాలని సీఎం భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో కరోనా నియంత్రణ, వైద్య ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సరిహద్దు రాష్ట్రాలకు చెందిన జిల్లాల్లో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని, ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఓ శాస్త్రీయ అధ్యయనం చేయాలని సూచించారు. కరోనా విస్తరణకు గల మూలాలను అన్వేషించాలని అధికారులను కోరారు.
ప్రపంచంలోనే కరోనా మూలాలను ఎవరూ అన్వేషించలేకపోతున్నారని, కరోనా అంతు చిక్కని సమస్యగా మారిపోయిందిన కేసీఆర్ అన్నారు. ఏ వేరియంట్, ఏ వేవ్ ఎప్పుడు వస్తుందో, ఎంత వరకూ విస్తరిస్తుందో తెలియడం లేదని, ఏ రోగానికైనా కారణం దొరికితే నివారణ అత్యంత సులభమన్నారు. కరోనా కారణం, లక్షణంతో సహా మొత్తం స్వరూప స్వభావాలు తెలియడం లేదని, అర్థం కావడం లేదని అన్నారు. కరోనా నియంత్రణ కోసం నూతన మార్గాలు అన్వేషించాల్సిందేనని కేసీఆర్ పేర్కొన్నారు.