Namaste NRI

ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం మరియు గ్రాడ్యుయేషన్ వేడుకలు

Telugu Samiti of Nebraska మరియు TANA పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు బడి వార్షికోత్సవం మరియు గ్రాడ్యుయేషన్ వేడుకలు అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. విదేశీ నేలపై తెలుగు భాషా పరిరక్షణకు అంకితభావంతో కొనసాగుతున్న తెలుగు బడి మరో విజయవంతమైన విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది.

2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫైనల్ పరీక్షలను విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేయగా, మొత్తం 62 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను చప్పట్లతో అభినందించారు. చిన్నారుల ఆనందం, తల్లిదండ్రుల గర్వం, ఉపాధ్యాయుల సంతృప్తి కలిసి సభను భావోద్వేగభరితంగా మార్చాయి.

తెలుగు సమితి ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ, Telugu Samiti of Nebraska తరఫున TANA Paatasala తో జరిగిన అద్భుతమైన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభం నుండి ముగింపు వరకు సాగిన ఈ ప్రయాణం రెండు సంస్థల మధ్య నమ్మకాన్ని, అనుబంధాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. ఈ సహకార బంధాన్ని నిర్మించడంలో దూరదృష్టి మరియు ప్రేరణతో ముందుండిన శ్రీ రాజా కాసుకర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో విశేష సహకారం అందించిన శ్రీ భాను మరియు శ్రీ శేఖర్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అలాగే కొల్లి ప్రసాద్ గారు పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో తప్పకుండా తెలుగులో మాట్లాడాలని సూచించారు. మన భాషే మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు మూలాలకు ప్రతిబింబమని, తెలుగు మాట్లాడటం ద్వారా పిల్లలు తమ వారసత్వానికి మరింత దగ్గరవుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రధానోపాధ్యాయులు వేణు మురకొండ విశేష కృషి చేశారు. మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు.

గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను శ్వేత బొడెపూడి , పావులూరి సత్యనారాయణ , నవీన్ కంటెం మరియు నాగరాజు ముద్దెల్లి విద్యార్థులకు అందజేసి, తెలుగు భాషను ఆసక్తిగా నేర్చుకుని ధైర్యంగా మాట్లాడాలని ప్రోత్సహించారు.

తెలుగు బడి ఉపాధ్యాయులు రాజా, ఉమా , పవిత్ర , దివ్య , సుధీర్ , స్వప్న , వీణామాధురి , సువర్ణరేఖ, మౌనిక , సుహిత మరియు తనూజ విద్యార్థులకు తెలుగు భాషను ప్రేమగా బోధిస్తూ వారిలో భాషపై ఆసక్తి పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించారు. వారి అంకితభావం, సహనం మరియు కృషిని తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు, వాలంటీర్లు, తల్లిదండ్రులు మరియు ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events