అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన విస్కాన్సిన్ డెల్స్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగింది. సాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఆరు సీట్లు, ఒకే ఇంజిన్ కలిగిన పైపర్ పిఏ-46 రకం చిన్న విమానం కెనోషా నుంచి మెనోమోనీకి బయలుదేరింది.

అయితే పైపర్ పి ఏ-46 విమానం 24,000 అడుగుల (7,315 మీటర్ల) ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు దాని రెక్కలపై మంచు పేరుకుపోతున్నట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు చెప్పి, కిందికి దిగడానికి అనుమతి కోరాడు. ఇంతలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన విస్కాన్సిన్ డెల్స్కు దగ్గరలో ఉన్న మిర్రర్ లేక్ స్టేట్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్ టిఎస్ బి) దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.















