సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన తెలుగు తేజం నెల్లూరుకు చెందిన మహాద్ షాను కేంద్ర ప్రభుత్వం తరఫున రియాధ్‌లోని భారతీయ ఎంబసీ ఘనంగా సన్మానించింది. 17ఏళ్ల మహాద్ షా బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ పతాకం సాధించడంతో పాటు రూ.2.18కోట్ల నగదు బహుమతిని అందుకుని రికార్డు సృష్టించాడు.
కేరళకు చెందిన ఖదీజా అనే బాలిక కూడా ఇదే తరహా విజయాన్ని సాధించింది. ఇద్దరు విజేతలను తాత్కలిక రాయబారి యన్. రాంప్రసాద్ ఎంబసీ కార్యాలయంలో శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. విజేతలకు జ్ఞాపికలను కూడా బహుకరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ అధికారులు, విజేతల కుటుంబ సభ్యులు, పాఠశాల ప్రిన్సిపల్ గ్రే థామస్, ప్రముఖ సమాజిక సేవకులు షిహాబ్ కొత్తుకాడ్, తెలుగు ప్రవాసీ సంఘం సాటా ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ మజమీల్ శేఖ్, తెలుగు ప్రవాసీ ప్రముఖులు దుగ్గపు ఎర్రన్న, ఉషా శ్రీ, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.














