అంతర్జాతీయ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐఓఏఏ) లో భారత విద్యార్థులు సత్తా చాటారు. వియత్నాంలో సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 5 వరకు జరిగిన 19వ అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో భారత బృందం నాలుగు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించింది. దీంతో పోటీల్లో పాల్గొన్న భారత బృందంలోని ప్రతి విద్యార్థి పతకం సాధించిన ఘనతను దక్కించుకున్నాడు.

ఈ ఒలింపియాడ్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రాంజల్ దీక్షిత్, దిల్లీకి చెందిన సుమంత్ గుప్తా, గురుగ్రామ్‌కు చెందిన అక్షత్ శ్రీవాస్తవ, ఫరీదాబాద్‌కు చెందిన అర్వాన్ సెహ్రావత్ స్వర్ణ పతకాలు సాధించారు. వడోదరకు చెందిన హర్షిల్ అమిత్‌కుమార్ పటేల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఆతిథ్య దేశమైన వియత్నాంతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. ఇరాన్, దక్షిణ కొరియా చెరో ఐదు స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి.

ఈ ఫలితాలతో అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్‌లలో 2026వ సంవత్సరం భారత్‌కు ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఏడాది వివిధ దేశాల్లో జరిగిన గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లలో భారత్ నుంచి పాల్గొన్న మొత్తం 24 మంది విద్యార్థులు పతకాలు సాధించారు. వారిలో 16 మంది స్వర్ణ పతకాలు, ఎనిమిది మంది రజత పతకాలు గెలుచుకున్నారు.















