
నెల రోజులుగా వ్యాలీ ఫీవర్‌తో పోరాడిన తెలుగు టెక్ ప్రొఫెషనల్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 5న మృతి చెందాడు. అతడి వైద్య, కుటుంబ ఖర్చుల కోసం నిధులు సేకరిస్తున్న అతడి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు చిరంజీవి కొల్ల(37)కి భార్య పావని, కుమారుడు విహాన్(5) ఉన్నారు. ఏప్రిల్‌లో సాధారణ ఫ్లూ లక్షణాలు తీవ్రం కావడంతో చిరంజీవిని అత్యవసర వార్డుకు తరలించారు. కొన్ని రోజుల తర్వాత అతడు వ్యాలీ ఫీవర్‌తో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. 30 రోజులు అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందించినా, చివరికి ఆ జబ్బుతో పోరాడలేక అతడు తుది శ్వాస విడిచాడు. చిరంజీవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తిమ్మాయపాలెం. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.















