Skip to main content

Namaste NRI

14 పాయింట్లతో అమెరికాకు ఇరాన్‌ కొత్త ప్రతిపాదనలు .. ఈసారైనా చర్చలు సాగేనా?

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఇంకా ఎటూ తేలడం లేదు. ఇరు దేశాల మొండి వైఖరితో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒక దేశం పంపిన ప్రతిపాదనలు ఇంకో దేశానికి నచ్చడం లేదు. దీంతో కనీసం చర్చలు కూడా జరగడం లేదు. తాజాగా అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు పంపింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్‌ ద్వారా 14 అంశాలతో కొత్త ప్రతిపాదనల్ని అమెరికాకు పంపినట్లు తాజా సమాచారం. కాల్పుల విరమణ పొడిగించడం కన్నా, యుద్ధానికి ముగింపు పలికేలా ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాము కాల్పుల విరమణకన్నా, యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నామని ఇటీవలే ఇరాన్ ప్రకటించింది. అయితే, అమెరికా చేస్తున్న డిమాండ్లు అనుచితంగా ఉన్నాయని ఇరాన్ విమర్శించింది. ఇదే సమయంలో యుద్ధానికి ముగింపు పలికేలా ఇరాన్‌ను చర్చలకు ఒప్పించడం కోసం పాకిస్తాన్ మంత్రి మోసిన్ నక్వీ ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. ఇరాన్ ప్రధాన డిమాండ్లకు సంబంధించి, విదేశాల్లో ఉన్న తమ దేశపు ఆస్తుల్ని విడిపించడంతోపాటు, చాలాకాలంగా తమపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని కోరుతోంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయెల్ బకాయి మాట్లాడుతూ అమెరికా తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు యుద్ధానికి సన్నాహాలు చేయడాన్ని ఖండించారు.

అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా లేకపోతే ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పేలా లేదు. అవసరమైతే మళ్లీ యుద్ధం ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. అయితే, తాము కూడా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది.

Social Share Spread Message

Latest News