తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో తెలుగు ప్రవాసీయులు న్యూజెర్సీ బోనాల జాతర పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం చివరి వారం సందర్భం గా నిర్వహించే మహంకాళీ బోనాలను న్యూజెర్సీలోని ఓం శ్రీ సాయి బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ లో ఈ సంబురాలు కన్నుల పండువగా నిర్వహించారు. దాదాపు 500కు పైగా తెలుగు కుటుంబాల వారు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.
అమ్మ వారి ఊరేగింపు, డప్పు వాయిద్యం, పోతరాజు విన్యాసాలు, అలంకారంతో ఉన్న అమ్మవారిని తన హస్తాలతో మోస్తున్న మందిరం ముఖ్య అర్చకులు, తెలంగాణ కట్టు బొట్టుతో చక్కగా తయారై బోనాలను తలపై పెట్టుకుని నడుస్తున్న మహిళలు, యువత నృత్యాలు వీటన్నిటితో పాటు వందలాది తెలుగు వారితో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణ కన్నుల పండువగా జరిగింది. భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుళ్ల నడుమ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోగా టీటీఏ వారు సమర్పించిన వెండిబోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన బిక్షుయాదవ్ పోతురాజు వేషధారణలో చిందులతో విన్యాసాలు చేస్తూ అందరినీ అలరించారు.
ఈ కార్యక్రమంలో అడ్వైజరీ కౌన్సిల్ కో ఛైర్ పర్సన్ డాక్టర్ మోహన్ రెడ్డి పటోళ్ల, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల, బీఓడీ సుధాకర్ ఉప్పల, నర్సింహా పెరుక, నరేంద్ర యురవ, ఆర్‌వీపీలు సాయి గుండూర్, మధుకర్ రెడ్డితో పాటు ఆర్గనైజింగ్ బృంద సభ్యులంతా సపరివారంగా వేడుకల్లో పాల్గొన్నారు. బోనాల జాతరకు వందలాదిగా వచ్చి వేడుకను దిగ్విజయం చేసిన వారందరికీ టీటీఏ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.