నాట్స్ డి ఎఫ్ డబ్ల్యు ఛాప్టర్ వారి ఆధ్వర్యంలో టెక్సాస్ లోని ఫ్రిస్కో పట్టణ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో ఏప్రియల్ 8, 2023 శనివారం నాడు నాట్స్ మహిళా సంబరాలు ఆసాంతం ఆహుతులను మహదానందపరచాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైన ఈ సంబరాలు తెలుగమ్మాయి వంటి వైవిధ్యభరితమైన క్రొంగొత్త కార్యక్రమాలతో అందరినీ అలరించాయి.
తెలుగమ్మాయి కార్యక్రమంలో మూడు విభాగాలు ముద్దుగుమ్మ, కిన్నెరసాని, కావ్యనాయిక పోటీల్లో ఎందరో పాలుపంచుకుని వారి ప్రతిభాపాటవాలతో వేదిక కరతాళధ్వనులతో మిన్నంటేలా చేసారు. ఇక్కడ ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ స్ధానాలలో నిలిచిన విజేతలు వచ్చే నెలలో న్యూజెర్సీలో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలలో జాతీయస్ధాయి విజేతలుగా నిలవడానికి పోటీపడతారు.
డాలస్ సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న నలుగురి మహిళామణులని డాక్టర్ భానుమతి ఇవటూరి (సామాజిక సేవ), శ్రీమతి గీత దమ్మన్న (అటార్నీ & కౌన్సిలర్ ఎట్ లా), శ్రీమతి మైత్రేయి ఇడపలపాటి (సర్టిఫైడ్ యోగా టీచర్), చిన్నారి సాయి తన్మయి (అమెరికా మహిళా క్రికెటర్) వారి వారి సేవలని గుర్తించి ఆహుతుల చప్పట్ల మధ్య నాట్స్ అధ్యక్షులు శ్రీ బాపయ్యచౌదరి నూతి గారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలని అందించారు.
ఈ మహిళా సంబరాల సందర్భంగా మహిళలకు పికిల్ బాల్ మరియు టెన్నిస్ పోటీలను నిర్వహించి విజేతలకు జ్ఞాపికలను నాట్స్ డాలస్ టీమ్ చేతులమీదుగా అందించడం జరిగింది అమెరికా తెలుగు సంస్ధలలో ప్రప్రధమంగా నాట్స్ఈ పికిల్ బాల్ పోటీలను నిర్వహించటం ముదావహం.
విభిన్నంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడంలో నాట్స్ ఎప్పుడూ ముందు ఉంటుందని, మహిళలకోసం మహిళల చేతుల మీదుగా మరిన్ని వేడుకలు జరగాలని ఆహుతులు మీడియాతో చెప్పడం జరిగింది. మే 2023 లో న్యూజెర్సీలో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలలో అందరినీ పాలుపంచుకోవాలని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి గారు ఆహ్వానించారు.