ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాక దానికి అధ్యక్షుడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరిని నియమించాలని భావిస్తున్నారన్న విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పుతిన్‌కు నమ్మకస్తుడైన విక్టర్ యానుకోవిచ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2010లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా విక్టర్ యానుకోవిచ్ ఎన్నికయ్యారు. అయితే ఆయన రష్యాకు అనుకూలంగా వ్యవహరించేవారు. దీంతో అప్పట్లో ఈయూతో రాజకీయ, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఒప్పుకోలేదు. చివరికు 2013 నవంబర్ నుంచి ఉక్రెయిన్‌లో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ తదుపరి ఏడాదే విక్టర్ పదవి కోల్పోయారు. అక్కడి నుంచి రష్యాకు పారిపోయి అక్కడే ఉంటున్నారు. ఆయన తనకిచ్చిన మద్దతు వల్ల పుతిన్ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయనపై ఉన్న అపార నమ్మకం వల్ల ఆయను మళ్లీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా చేయాలని పుతిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రభుత్వంలో విక్టర్కు చాలా కాలంగా సన్నిహత సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో యుద్దం ముగిసిన వెంటనే ఆయన విక్టర్ను అధ్యక్షుడిగా నియమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.














