అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని జాస్పర్ కౌంటీలో ఓ ఇంట్లో జరుగుతున్న హైస్కూల్ ప్రోమ్ పార్టీపై దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. దీంతో తొమ్మిది మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని రెండు దవాఖానలకు తరలించినట్లు జాస్పర్ కౌంటీ షరీఫ్ తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బాధితులంతా 15 నుంచి 19 ఏండ్ల మధ్య వయస్కులేనని తెలిపారు.


కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. యువకులంతా ఓ ఇంట్లో పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని చెప్పారు. కాల్పులు ఎవరు జరిపారనే విషయమై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితులు కోలుకున్న తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 19న మైనే పట్టణంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.
