ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘ సేవకురాలు రాధిక మంగిపూడికి తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ ప్రవాస తెలుగు పురస్కారం దక్కింది. దక్షిణాఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ యూరప్‌లోని నార్వే నుంచి వీధి అరుగు సంస్థల సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో అంతర్జాల వేదికపై వైభవంగా ఆగస్టు 28, 29 తేదీలలో రెండు రోజులపాటు జరగనున్నాయి.
తెలుగు భాషా దినోత్సవం 2021 కార్యక్రమంలో భాగంగా.. విదేశాలలో నివసిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన 12 మంది తెలుగు వారిని ఎంపిక చేసి ప్రవాస తెలుగు పురస్కారాలు 2021 అందజేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాధిక మంగిపూడి ఎంపికయ్యారు. ఈ పురస్కారానికి ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందని రాధిక తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులకు, తనను నిత్యం ప్రోత్సహిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.