హర్షివ్ కార్తీక్ ప్రధానపాత్రధారిగా స్వీయ దర్శకత్వంలో రచించి, నిర్మించిన చిత్రం బహుముఖం. గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హర్షివ్ కార్తీక్ విలేకరులతో మాట్లాడారు. విభిన్నమైన కోణాలుండే షార్ట్‌ఫిల్మ్ తీసి నన్నునేను నిరూపించుకోవాలనుకున్నాను. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ నిడివి తక్కువ ఉన్నా, ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే, రాయడం మొదలుపెట్టాక తెలియని ఉద్వేగం. నా ప్రమేయం లేకుండానే స్పాన్ పెరిగిపోయింది. ఇలాంటి కథ తెలుగులో రాలేదని నమ్మకం కుదిరిన తర్వాతే ఫీచర్ ఫిల్మ్ చేయడం జరిగింది అన్నారు. ఈ సినిమా కోసం కథక్ నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. ఈ సినిమా ఎక్కువశాతం యూఎస్‌లోనే తీశాను. మేడిన్ యూఎస్‌ఏ, అసెంబుల్ ఇండియా అనే ట్యాగ్‌తో ప్రమోషన్స్ కూడా అక్కడ స్టార్ట్ చేశాం. ప్రీప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకోవడంతో తేలిగ్గా సినిమా తీసేయగలిగాను. సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి మా సినిమా బాగానచ్చుతుంది అని తెలిపారు.